భద్రాచలం, నవంబర్ 27 : భద్రాచలం కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం మేజరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి ఎంపిక విషయంలో తనదే నిర్ణయం అనేలా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పొదెం వీరయ్య ప్రస్తుతం భద్రాచలంలో అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గీయులే తుది నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధిగా పేర్కొంటూ నామినేషన్ సైతం దాఖలు చేయడం పట్టణంలో చర్చనీయంశమైంది.
తీవ్ర అసంతృప్తిలో ఉన్న పొదెం వీరయ్య వర్గీయులు శుక్రవారం వీరయ్యతో చర్చించి ప్రస్తుతం నామినేషన్ వేసిన అభ్యర్ధికి మద్దతు ఇవ్వడమా లేక కొత్తగా మరో అభ్యర్ధితో నామినేషన్ దాఖలు చేయడమా అనేది నిర్ణయం తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. ఎమ్మెల్యే వర్గీయుల తరపున నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తితో సైతం కీలక నేతలు ఎవరు లేరని, ఏకపక్ష నిర్ణయం తీసుకుని దానిని పార్టీ నిర్ణయంగా చెప్పడం సమంజసం కాదంటున్నట్లు సమాచారం.
గురువారం ఉదయం ఎమ్మెల్యే ఇంట్లో సైతం కాంగ్రెస్ వర్గీయుల సమావేశం జరగ్గా పొదెం వీరయ్య వర్గీయులను ఆహ్వానించలేదు. ఎమ్మెల్యేనే సొంత నిర్ణయం తీసుకుని దానిని పార్టీ నిర్ణయంగా ప్రకటించి హడావుడిగా నామినేషన్ దాఖలు చేయడం సమంజసం కాదని, ఈ విషయాన్ని డీసీసీ, పీసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్ధిని నిలబెట్టగా, తమ పార్టీ తరపున అందరి అంగీకారం లేకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుని అభ్యర్ధిని బరిలో ఎలా నిలుపుతారని తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. పొదెం వీరయ్య తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు, పొదెం వీరయ్య వర్గీయులు పేర్కొంటున్నారు.