రామవరం, మే 05 : రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 10 వేల మంది విద్యార్ధులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటికి వెళ్తున్నారని, మైనారిటీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేకమంది విద్యార్ధులు గత ఐదేళ్లుగా ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 79 గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయని, మైనారిటీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదన్నారు. దీని కారణంగా గురుకులాల్లో ఇంటర్ చదివిన విధ్యార్దులు ఉన్నత విధ్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బాల, బాలికల కోసం వేర్వేరుగా ఉమ్మడి జిల్లాల్లో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మైనారిటీ గురుకులాల కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మైన్ కు లేఖల ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు.