చుంచుపల్లి, ఆగస్టు 26 : చుంచుపల్లి మండలం చండ్రుకుంట గ్రామానికి ఓ వ్యక్తి సోమవారం అడవిలోకి వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనగడప అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్ సత్తెంపేట బీట్‌లోని కంపార్ట్మెంట్ నం.19లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెనగడప, సండ్రకుంట గ్రామ సమీపంలోని గోత్తికోయ నివాస ప్రాంతానికి చెందిన మడకం సింగయ్య సోమవారం అడవిలోకి వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఎలుగుబంటి దాడిలో సింగయ్య గాయపడగా, విషయం తెలిసిన అటవీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించే చర్యలు చేపట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనపై వివరాలు సేకరించారు. సింగయ్యకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.