కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 24 : సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.500 బోనస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి పెద్దబోయిన సతీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కార్మికులతో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల బోనస్‌ను యాజమాన్యం ప్రకటించింది.
గతేడాది రూ.5 వేలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.500 మాత్రమే పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులకు రూ.10 వేలు బోనస్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 26న స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శంకర్, నాగమ్మ, మల్లేశ్, లోకేశ్, సురేశ్, తార, రోజా, లక్ష్మీ పాల్గొన్నారు.