రుద్రంపూర్, జనవరి 24 : సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించనున్న ‘కొత్తగూడెం ప్రకాశం’ కార్యక్రమంలో ఆయనను సన్మానించనున్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల ఆదేశాలు, వారి మార్గదర్శకత్వంలో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు కార్మికుల భద్రతా చర్యల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు సమాచారం. అలాగే సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి సీ అండ్ ఎండి ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందితే బీమా సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించి, వారందరికీ ప్రమాద బీమా కల్పించేలా ఖాతాలు తెరిపించడం ప్రశంసనీయంగా నిలిచింది.
కార్మిక కాలనీల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు, కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించి క్రీడలకు విశేష ప్రోత్సాహం అందించారు. అదేవిధంగా ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లోనూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎం.శాలెం రాజును ఉత్తమ అధికారిగా ఎంపిక చేసినట్లు సంస్థ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు, అధికారులు, కార్మికులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.