– పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
– అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునీకరించడంతో పాటు అంగన్వాడీ సేవలు పారదర్శకంగా, సమర్ధవంతంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక వాసవీ ఫంక్షన్‌హాల్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తల విధుల్లో ఆధునీకతను జోడించే దిశగా ఈ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వీటివల్ల అంగన్వాడీలకు సేవలు సులభతరంగా ఉండటంతో పాటు పారదర్శకంగా ఉండేలా ఉపయోగ పడతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా సేవల్లో వేగం పెరుగుతుందన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా పారదర్శకంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే వీలుంటుందన్నారు. అనంతరం మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను సీడీపీఓ రేవతితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి, సర్పంచులు కిషోర్‌నాయక్, మందా నాగరాజు, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, ఈఓ మహేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్థానిక నాయకులు భజన సతీష్, ప్రసాద్, ఇంగువ రమేష్, మహిమూదాఖాన్, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, మండలంలోని అన్ని కేంద్రాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.