కొత్తగూడెం అర్బన్, మే 19 : భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి దేవస్థానాలకు వెంటనే పాలక మండలిని ప్రకటించాలని తొలి, మలి, 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గాజులరాజం బస్తీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవస్థానాల ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం అభినందనీయం, హర్షదాయకమన్నారు.
కానీ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి 150 రోజులు గడిచినా నేటికీ ఆలయ పాలక మండళ్లు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. భక్తిపరులు, సంఘ సేవకులు, నిస్వార్ధపరులను సభ్యులుగా నియమించి దేవస్థానాల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి రామ్మూర్తి, కాకెళ్లి సైమన్, డి శ్రీనివాస్, ధూళిపాల మురళీధర్ రావు, ప్రసాద్, కరుణావతి, తాటి శోభారాణి పాల్గొన్నారు.