– పరారీలో మరో ఇద్దరు, మూడు ఆటోలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం
రుద్రంపూర్, జూలై 15 : కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై సామూహిక లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, క్రైమ్ నంబర్ 109/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా నలుగురిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా మూడు ఆటోలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ ఎస్హెచ్ఓ కరుణాకర్, టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.