రుద్రంపూర్, మే 26 : వడదెబ్బ కారణంగా సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన ఘటన గౌతంపూర్లో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతమ్‌పూర్ పంచాయతీ టి-2, 3ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సింగరేణి మాజీ కార్మికుడు పిట్టల నరసింహారావు (60) మంగళవారం ఉదయం రుద్రంపూర్ మార్కెట్ సెంటర్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సింగరేణి అంబులెన్స్‌లో ఆయనను సింగరేణి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
నరసింహారావుకు కుమారుడు ఉండగా ఆయన భూపాలపల్లిలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణవార్త తెలిసిన ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాలో ఆదివారం ఇద్దరూ, మంగళవారం ఒకరు మృతి చెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.