రామవరం, ఆగస్టు 12 : అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఓఎస్డీ జి.నరేందర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆఫీసర్, సిబ్బందితో మాట్లాడారు. గుత్తి కోయ గ్రామాలైన గడ్డిగుప్ప, మర్రిగూడెం, జగ్గారం, పాలెం వాగు గ్రామాల్లో నివసిస్తున్న గుత్తి కోయల గురించి విచారించి సిబ్బందికి సూచనలు చేసి, గుత్తి కోయ గ్రామాలకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం సేకరించాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, తెలిసిన సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.