జూలూరుపాడు, ఆగస్టు 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు జూలూరుపాడులో భానోధర్మ అధ్యక్షతన సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమవేశంలో సిపిఐ, సీపీఐ(ఎం), సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా, న్యూడెమోక్రసీ, మండల కార్యదర్శులు, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, బానోతు ధర్మ, యాస నరేశ్, వల్లోజీ రమేశ్ మాట్లాడారు.
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నూతన చట్టాలను తీసుకువచ్చి కార్మిక, వ్యవసాయ రంగాలను ప్రైవేట్‌పరం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలన్నారు. చట్టాలను ఉపయోగించి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ కొనసాగిస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తుందన్నారు. ప్రభుత్వాలే పర్యావరణాన్ని నాశనం చేస్తూ మరోపక్క ఆదివాసీలను పర్యావరణం పేరుతో అడవుల నుండి గెంటివేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జి.వెంకటేశ్, సీతారాం పాల్గొన్నారు.