ఇల్లెందు, ఆగస్టు 02 : ఇల్లెందు సీహెచ్సీలో పని కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ సి సి డబ్ల్యూ యు) రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. రాసుద్దీన్, తెలంగాణ ప్రగతిశీల ఆటో& మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం ఇల్లెందు ఏరియా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. బొగ్గు నాణ్యత లేదనే పేరుతో కేఓసి నుండి బొగ్గు రవాణ నిలిపి వేయడంతో ట్రాన్స్పోర్ట్, రైల్వే వ్యాగిన్లు ఆగిపోవడంతో వీటిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కార్మికులందరికీ ఉపాధి కల్పించే విధంగా సీహెచ్సీని యధావిధిగా కొనసాగించాలని, ఆర్ టీ ఏ పెంచినటువంటి లైసెన్స్ ఫీజులను వెంటనే తగ్గించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో, మోటార్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి డి.మోహన్ రావు, నాయకులు కొండపల్లి శ్రీనివాస్, నరాటి వెంకటేశ్వర్లు, ఆదేర్ల అంజయ్య, తొగర సామెల్, రామిశెట్టి నరసింహారావు, డి.నూనెశ్వరరావు, ఎ.మహేందర్, బి.లాలు పాల్గొన్నారు.