చండ్రుగొండ, మార్చి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు అయిన ఎదుల్ల వాగు ఎండాకాలం రాకముందే నెల రోజులకు ముందే వట్టిపోయింది. వాగు వెంబడి గ్రామాలైన రేపల్లెవాడ, తుంగారం, గానుగపాడు, సత్యనారాయణపురం, తిప్పనపల్లి, చండ్రుగొండ, అయ్యన్నపాలెం, సీతయ్యగూడెం గ్రామాల్లోని రైతులు ఎదుల్ల వాగును నమ్ముకుని ఎండాకాలం సుమారుగా 700 ఎకరాల్లో వరి సాగు చేశారు.
నెలరోజుల పాటు సాగునీరుకి ఎటువంటి ఇబ్బంది పడని రైతులు, క్రమంగా వాగులో నీరు ఇంకిపోవడంతో వారి ఆశలు ఆవిరి కావడం ప్రారంభమయ్యాయి. కండ్ల ఎదుటే వరి పొలాలు ఎండిపోతుంటే రైతులు చూడలేక వాగులో వేల రూపాయలు వెచ్చించి జేసీబీల సహాయంతో నీటి గుంటలను తవ్వించారు. అవి కూడా వారం రోజులు గడవకముందే ఎండిపోయాయి. దీంతో పంట చేతికి వచ్చే సమయంలో పొట్ట దశలోనే వరి పొలాలు ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు పంట పొలాలు ఎండిపోతుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడు ఇటువంటి పరిస్థితి చూడలేదని వాపోతున్నారు.
Edulla Vaagu : వట్టిపోయిన ఎదుల్లవాగు… ఎండుతున్న వరి పంటలు