గుండాల, మార్చి 19 : తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి 7.57 శాతం నిధులు కేటాయించడం అన్యాయమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ప రాజేశ్ అన్నారు. విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ గుండాలలో బుధవారం నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర కోతలను మిగిల్చిందని ఆరోపించారు. ఈ కేటాయింపులు విద్యారంగ అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని మండిపడ్డారు. సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలంటే కనీసం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. గురుకుల ఉపాధ్యాయ అర్హత సాధించి, గురుకుల బోర్డు అవకతవకల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. కొత్తగూడెం కేంద్రంగా ఒక మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ, లేనిపక్షంలో విద్యార్థి నిరుద్యోగులను కలుపుకుని పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అజిత్, అఖిల్, ప్రణయ్, సురేశ్ కుమార్, వెంకటేశ్, నరేశ్ కుమార్ పాల్గొన్నారు.