బూర్గంపహాడ్, ఆగస్టు 31 : అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీ నుండి గత కొంతకాలంగా సుమారు 30 ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గ్రామం మధ్యలో కిన్నెరసాని ఉప నది నుండి జనావాసాల మీదుగా లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి రణగొన ధ్వనులతో అతివేగంగా వాహనాలు నడుపుతూ ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని ఆరోపించారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా కారణంగా ట్రాక్టర్ల నుండి వచ్చే శబ్దాలతో కాలనీలోని స్థానికులు, పిల్లలు నిద్రాభంగంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా ట్రాక్టర్ యజమానులు కక్షగట్టి స్థానికులపై వ్యక్తిగత దాడులకు దిగడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇసుక అక్రమ రవాణాను నిషేధించి రక్షణ కల్పించాలని కోరారు.