రామవరం, జులై 01 : ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో 35 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పని చేసిన బైరి శ్రీనివాసన్ సేవలు అభినందనీయమని వక్తలు అన్నారు. మంగళవారం ఉద్యోగ విరమణ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ అధికారి కొలిపాక శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన బైరి శ్రీనివాస్ శ్రోతలను అలరించడానికి అనేక కార్యక్రమాలను రూపొందించారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందిన “మరో ప్రపంచం” కార్యక్రమానికి జాతీయస్థాయి అవార్డు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బాబు సింగ్, ప్రభాకర్ రావు, ఎస్.స్వామి, దాసరి వెంకటేశ్వర్లు, రవీందర్ సిబ్బంది, ఆర్జేలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.