జూలూరుపాడు, మార్చి 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామానికి చెందిన యువ రైతు జరుపల కృష్ణ మొక్కజొన్న కంకులు తిని మృతి చెందిన విషయం తెలిసిందే. యువ రైతు మృతికి కారణమైన విత్తన కంపెనీపై చర్యలు చేపట్టి రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి చండ్ర నరేంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలంలోని వినోబానగర్ గ్రామంలో రైతు కుటుంబాన్ని సోమవారం స్థానిక రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు మృతికి సీడ్ కంపెనీలు బాధ్యత వహించి రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మండలంలో అధిక విస్తీర్ణంలో ఆడ మగ మొక్కజొన్న పంట సాగు చేపట్టి, అధిక రసాయనాలు పురుగుమందులు వాడి తక్కువ కాలంలో ఎక్కువ పంట వస్తుందంటూ ముందస్తు పెట్టుబడులు ఇచ్చి విత్తన కంపెనీలు రైతులను మోసగిస్తున్నాయని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలను కంపెనీలకు అమ్మినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా దగా చేస్తున్నారని ఆరోపించారు. రైతులను మోసగిస్తున్న సీడ్ యాజమాన్యాలు, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు, చెరుకుమల్ల రాజేశ్వరరావు, కొండా వీరయ్య, గుండెపిన్ని పుల్లారావు, సాయిని నరసింహారావు పాల్గొన్నారు.