– ఖమ్మం రూరల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 03 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడి గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గొల్లపాడు గ్రామానికి చెందిన సంపేట శివ (22). వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామంలో శివ ఇంటి పక్కన నివాసం ఉంటున్న మునిష్ ఇరువురు స్నేహితులు. ఈ నెల 2వ తేదీన గురువారం మునేష్ కు అతడి భార్యకు మధ్య గొడవ జరిగింది. గత కొద్ది రోజులుగా మునేష్ భార్యకు శివ వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాడని గ్రహించాడు. దీంతో గొడవ జరిగిన అనంతరం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఓ సైట్ లో మట్టితోలకం చేస్తున్న శివ దగ్గరికి వెళ్లాడు. మునేష్ అతడిని తన బైక్ పై ఎక్కించుకుని గొల్లపాడు వచ్చే దారి మధ్యలో గల ఆరెకోడు గ్రామం సమీపంలోకి రాగానే బండి ఆపి నా భార్యకు వాట్సాప్ మెసేజ్లు ఎందుకు చేస్తున్నావని ఆగ్రహంతో కత్తితో గొంతు కోసే ప్రయత్నం చేశాడు.
దీంతో అడ్డుకున్న శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దాడి నుండి తప్పించుకున్న శివ కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ గ్రామానికి చెందిన గునిగంటి లక్ష్మయ్య అనే వ్యక్తి శివ పరిస్థితిని గ్రహించి అతడి సెల్ ఫోన్ సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న శివ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని మరో ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. తన కొడుకుపై హత్యా ప్రయత్నం చేసిన మునీష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శివ తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.