అశ్వారావుపేట, నవంబర్ 4: అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఆయన విజ్ఙప్తి మేరకు వైద్యారోగ్యశాఖ కొద్దిరోజుల్లోనే సీహెచ్‌సీలో వైద్యసేవలు అందించేందుకు ఆరుగురు వైద్యులను కేటాయించింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స అందించే వైద్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. వైద్యుల నియామకంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఈ ఆసుపత్రిలో 12 మంది వైద్యులు పని చేయాల్సి ఉంది. కానీ కొన్ని నెలల క్రితం వరకు ఇద్దరు లేదా ముగ్గురు వైద్యులు మాత్రమే సేవలు అందించే వారు. వీరిలోనూ కాంట్రాక్ట్ వైద్యులే ఎక్కువ మంది ఉండేవారు. వీరు ఎప్పుడు మానేస్తారో తెలియదు. ఎప్పుడు పనిచేస్తారో తెలియదు. తర్వాత నియమితులైన వారిలో కొందరు ఉన్నత చదువుల కోసం కొలువు వదిలేసి వెళ్లేవారు. దీంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందేవి కావు.
ఎమ్మెల్యే చొరవతోనే..
సమస్యను ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకొచ్చారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన వెంటనే వైద్యుల నియామకం చేపట్టాలని కలెక్టర్ అనుదీప్‌తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఆస్పత్రికి ఆరుగురు వైద్యులను నియమించారు. గతంలో ఉన్న ఇద్దరు వైద్యులు ఉండగా తాజాగా వైద్యులు స్పందన, జయలక్ష్మి, అరుణకాంత్, కృష్ణకాంత్, పూర్ణచంద్రరావు, మౌళిక విధుల్లో చేరారు. ఈ ఎనిమిది మంది వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో క్రమంగా ఓపీ పెరుగుతున్నది. వైద్యుల నియామకంపై జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజలకు అండగా నిలబడ్డారు. కొవిడ్ బాధితులకు విశిష్ట సేవలు అందించారు. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడారు. ఇప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి..
అశ్వారావుపేట పూర్తి స్థాయిలో గిరిజన నియోజకర్గం. ఇక్కడి ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. నా వంతుగా నేను ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నాను. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆస్పత్రి సీహెచ్‌సీలో వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం చూపాను. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాను.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే