భద్రాచలం/ బూర్గంపహాడ్, మే 16: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మరమ్మతు పనులన్నింటినీ ఈ నెల 20లోపు పూర్తి చేయాలని, వాటి చిత్రాలను తన కార్యాలయానికి పంపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని డార్మెటరీ, తరగతి గదులు, టాయిలెట్లు, వాష్ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ..
డార్మెటరీకి ఉన్న వెంటిలేటర్లకు మెష్ ఏర్పాటు చేయాలని, వాష్ రూమ్, తరగతి గదుల గోడలను ఫినాయిల్‌తో శుభ్రం చేయించాలని, పిల్లలందరూ మంచాలపై పడుకునే విధంగా విశాలంగా గదులను ఏర్పాటు చేయాలని, మూడు బెడ్లకు ఒక ఫ్యాన్ తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఇప్పచెట్లను కానీ, పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండే మొక్కలను నాటించాలని సూచించారు. పిల్లలకు గాలి, వెలుతురు, నీరు సక్రమంగావచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సెలవులకు వెళ్లిన విద్యార్థులు తిరిగి వచ్చేలోగా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని స్పెషలాఫీసర్లు, హెచ్ఎంలకు సూచించారు. డీడీ మణెమ్మ, హెచ్ఎం కృష్ణ పాల్గొన్నారు.