బోనకల్లు, ఆగస్టు 05 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతి బాయి అన్నారు. మంగళవారం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రికార్డులను, ల్యాబ్‌ను, మందులను పరిశీలించారు. అనంతరం వైద్యశాలలో జరిగే ఆశ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి రోజూ డ్రై డేగా పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా జనాల్లో పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.
జ్వరం సోకిన ప్రతి కేసును ఫాలో అప్ చేసుకుంటూ, అవసరమైన వారిని ఆస్పత్రికి పంపాలన్నారు. పీహెచ్సీ నందు కాన్పుల సంఖ్య పెంచాలని, హై రిస్క్ గర్భిణీలకు జిల్లా ఆస్పత్రి నందు కాన్పు అయ్యేలా చూడాలని తెలిపారు. టీబీ, లెప్రసి వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య పరీక్షల గురించి అవగాహన కల్పించాలన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ ను నెలకి ఒకసారి మెడికల్ ఆఫీసర్ విజిట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సూపర్వైజర్లు దానయ్య, స్వర్ణ మార్త, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.