భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా.. అక్కా అంటే చాలు తక్షణమే మందులతో ఇంటిముందు ప్రత్యక్షమవుతారు. ముఖ్యంగా గర్భిణులకు కన్నతల్లి కంటే ఎక్కువనే వారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పురుడు పోసుకునే వరకు వారిని కంటికిరెప్పలా కాపాడుతూ ఉంటారు. అంతేకాదు.. పల్లెల్లో జ్వరాలు ప్రబలినా, పెద్ద పండుగలు జరిగినా, ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించినా అక్కడ జరిగే వైద్యశిబిరాల్లో ఉండేదీ ఆశా కార్యకర్తలే. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్తలు నేడు అరకొర వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.
చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. తమకు జీతాలు పెంచండి మహాప్రభో అంటూ నెత్తీనోరు కొట్టుకుంటున్నా, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా మొన్న జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడంతో వారు మరింత అసహనానికి గురవుతున్నారు. అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖం చాటేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేసి ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారంరోజుల క్రితం కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేసినా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. జిల్లాలో 1,370 మంది ఆశా కార్యకర్తలు ఆయా ఆసుపత్రుల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కొంతవరకు వేతనాలు(పారితోషికం) పెంచినా అవి సరిపడకపోవడంతో వేతనాల కోసం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్కసారి కూడా వేతనాలు పెంచకపోగా అరెస్టులు చేసి నిర్బంధించడంతో ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.9 వేలతో విధులు నిర్వహిస్తున్న ఆశాలకు కనీసం వేతనం రూ.18 వేలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరికి ఎలాంటి వ్యాధులున్నా అది సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలంటే ఆశా కార్యకర్తల సపోర్టు ఉండాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 వరకు సర్వేలు గ్రామాల్లో ఆశా కార్యకర్తలు చేస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, లెప్రసీ, టీబీ, హెచ్ఐవీతోపాటు ఇతర వ్యాధుల సర్వే, గ్రామాల్లో వైద్య శిబిరాల డ్యూటీలు ఆశాలకే వేస్తున్నారు. గర్భిణులను ప్రతినెలా అమ్మఒడి వాహనంలో మాతా, శిశు ఆసుపత్రులకు తీసుకెళ్లడంతోపాటు వారికి కాన్పులు అయ్యేవరకు తోడుగా ఉండాల్సింది ఆశాలే. అటువంటి ఆశాలకు తగిన పారితోషికం ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నది. ఇప్పటికీ రెండునెలలుగా వేతనాలు లేకపోవడంతో ఆశా కార్యకర్తలు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మాకు పని ఎక్కువ.. జీతం తక్కువ. అతితక్కువ వేతనంతో పని చేస్తున్నది మా ఆశా కార్యకర్తలే. ఎవరికి ఎలాంటి వ్యాధి వచ్చినా అక్కడ మేము ఉండాల్సిందే. ఎంత మారుమూల గ్రామంలో ఏం జరిగినా ముందుగా అక్కడికి వెళ్లాల్సింది మేమే. ఎన్ని పనులు ఉన్నా ప్రతిరోజూ మాకు డ్యూటీ తప్పదు. ఇంటి వద్ద పనులు వదిలేసి మరీ గ్రామాల్లో తిరగాల్సిందే. చాలీచాలని వేతనాలతో మా కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. దయచేసి ప్రభుత్వం జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలి.
– ధనలక్ష్మి, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం
నిధులు వస్తే వెంటనే వేతనాలు ఇచ్చేస్తున్నాం. ఒక్కోసారి సమస్య వచ్చినప్పుడు ఓపిక పట్టాలి. వేతనాలు సరిపోని మాట వాస్తవమే. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ధర్నాలు చేసినప్పుడల్లా పై అధికారులకు చెబుతున్నాం. యూనియన్ నాయకులు వచ్చి వినతిపత్రాలు ఇస్తున్నారు. వాటిని వెంటనే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
– తుకారాం రాథోడ్, డీఎంహెచ్వో, భద్రాద్రి కొత్తగూడెం
మాకూ కుటుంబాలు ఉన్నాయి. పిల్లలను చదివించుకోవాలి. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి. ఇచ్చే కొద్దిపాటి పారితోషికం కూడా మూడు నెలలకోసారి ఇస్తున్నారు. ధర్నాలు చేసినా మేము ఎండపాలే తప్ప మాకు న్యాయం జరగడం లేదు. బీపీ, షుగర్లు ఉన్నవారికి ఇంటికెళ్లి మందులు ఇస్తున్నాం. కొన్ని జీవితాలు నిలబడుతున్నాయంటే మా వల్లనే అని చెప్పాలి. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. వెట్టిచాకిరీ చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు.
– ఝాన్సీ, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు, కొమ్ముగూడెం, జూలూరుపాడు మండలం
ఆళ్లపల్లి, ఏప్రిల్ 4 : వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 108 వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బంది సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది క్షతగాత్రులు, గర్భిణులను రోడ్డు సౌకర్యం లేనప్పటికి సరైన సమయంలో జిల్లా వైద్యశాలకు తరలించామని, చాలా మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడినట్లు సిబ్బంది కలెక్టర్కు వివరించారు. దీంతో వారి సేవలను కలెక్టర్ మెచ్చుకున్నారు.