ఖమ్మం రూరల్, జూన్ 03 : భారత ఆర్మీ జవాన్ కొత్త సంపత్‌కు జిల్లా ప్రముఖులు, మండల వాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సంపత్ గత కొన్నేండ్లుగా నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సంపత్ ఇటీవల భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం, ఆపరేషన్ సింధూర్‌లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. రెండు రోజుల క్రితం జిల్లాకి వచ్చిన సంపత్‌కు మండలంలోని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా సన్మానాలు చేశారు.
బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సంపత్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను జర్నలిస్ట్ సంఘం(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంపత్‌కు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సయ్యద్ ఖదీర్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, దువ్వా సాగర్, మాధవ్, వెంకటేశ్వర్లు, గోపి, శ్రీనివాస్ పాల్గొన్నారు.