భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లా వైద్యశాఖలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 73 పోస్టులు ఉండగా.. ఏకంగా 4 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి. వైద్య శాఖలోని స్టాఫ్ నర్సు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్హెచ్పీ), ఏఎన్ఎం, ఆపరేటర్లతోపాటు పలు విభాగాల వైద్యుల పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా వైద్య శాఖ అధికారులు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి 28 వరకూ దరఖాస్తులు స్వీకరించారు. దీంతో చివరి రోజైన బుధవారం ఐడీవోసీలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి అభ్యర్థులు పోటెత్తారు. ధరఖాస్తు చేసుకునేందుకు తప్పనిసరిగా అభ్యర్థులే రావాలనడంతో బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మహిళా అభ్యర్థులు తమ చంటి పిల్లలకు పాలు పట్టిస్తూ అవస్థలు పడ్డారు. అవే అక్కట్లతో దరఖాస్తులు పూర్తి చేశారు. అయితే అధికారులు అక్కడ తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు దరఖాస్తులపైనా, వాటికి జత చేసిన సర్టిఫికెట్లపైనా గెజిటెడ్ అధికారుల సంతకాలు కావాలనడంతో చాలా మంది అభ్యర్థులు ఐడీవోసీలోని వివిధ శాఖల్లో ఉన్న గెజిటెడ్ అధికారులను వెతుక్కుంటూ వెళ్లారు. సంతకాల కోసం వారిని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఏడు కౌంటర్లు ఏర్పాటు చేసినా అవన్నీ నిండిపోయారు.
వైద్యశాఖలో పోస్టులు దక్కించుకోవడం కోసం ఇప్పటి నుంచే పైరవీలు, బేరసారాలు మొదలయ్యాయి. ‘మా వాళ్లను కచ్చితంగా చూడాలి’ అంటూ అధికార పార్టీ నాయకులు ఆ శాఖలోని పెద్ద అధికారికి రెండు రోజులుగా ఒకటే ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి వారు.. తాము మంత్రుల పీఏలమని చెప్పుకుంటూ అధికారులకు కాల్స్ చేస్తున్నారు. ‘మా వాళ్లు ఇద్దరున్నారు’ అంటూ కొందరు, మా వాళ్లు ముగ్గురున్నారు’ అంటూ మరికొందరు ఫోన్లు చేస్తూ పైరవీలకు దిగుతున్నారు. ఆ శాఖ ఉద్యోగులను మచ్చిక చేసుకుంటున్నారు. ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ.. తమకు మాత్రం పోస్టు కావాలని ప్రయత్నాలు చేశారు. దీంతో డీఎంహెచ్వో కార్యాలయం వద్ద పైరవీకారుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఫోన్లు ఎత్తడం లేదు. అయితే ఇప్పటికే ఒక మంత్రి పీఏ.. ఆ శాఖలోని ఇంకో అధికారికి ఫోన్ చేసి.. ‘మీ అధికారి ఫోన్ ఎత్తలేదు. ఎటు వెళ్లారు’ అంటూ వాకబు చేయడం కొసమెరుపు. కాగా.. అధికార పార్టీ నేతలు పైరవీలు చేస్తుంటే తమకు మిగిలేది మొండిచేయేనంటూ మెరిట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ఆస్పత్రుల్లో 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో స్టాఫ్ నర్సు 30, ఎంఎల్హెచ్పీ 25, పీడియాట్రిషన్ 1, ప్రోగ్రాం కోఆర్డినేటర్ 1, సీనియర్ డాక్టర్ 1, ఏఎన్ఎం 3, డీఈవో 1, క్వాలిటీ మేనేజర్ 1, మెడికల్ ఆఫీసర్ 1, పైతమాలజిస్టు 1, ఫార్మసిస్టు 3, జిల్లా డేటా మేనేజర్ 1, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి. వీటికి 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.