ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం సిగలో మరో మణిహారం చేరనుంది. విస్తరిస్తున్న నగరంలో ప్రజల సౌకర్యార్థం మంత్రి అజయ్ చేపట్టిన సంకల్పానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మున్నేరుపై బ్రిడ్జి నిర్మాణం గురించి బుధవారం ఖమ్మం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉత్తర్వులు వెలువడేలా మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతీసుకున్నారు. దీంతో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అభివృద్ధిలో భాగంగా నగరం విస్తరించిన తరుణంలో ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగకూడదనే లక్ష్యంతో నగరంలో నయాబజార్ వద్ద మున్నేరు బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో సీఎం వెంటనే స్పందించి ఖమ్మం ప్రజల చిరకాల కోరికను నెరవేర్చనున్నట్లు ఖమ్మం సభలో ప్రకటించారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేసిన కృషి, తీసుకున్న చొరవపై ఖమ్మం ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఆ వెంటనే మంత్రి స్వయంగా చొరవ తీసుకొని గురువారం పరిపాలనా ఉత్తర్వులు మంజూరు చేయించారు. మొత్తం బ్రిడ్జి 420 మీటర్ల పొడవు ఉండగా 300 మీటర్లు కేబుల్స్‌పై నిలుస్తుంది. 120 మీటర్లు ఆర్సీసీపై ఉంటుంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మితం కానుంది. ఈ సందర్భంగా మంత్రి అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.