కారేపల్లి, ఆగస్టు 30: నాన్ కమ్యునికబుల్ డిసీస్ (NCD) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఆన్లైన్ చేసే బాధ్యతల నుంచి తమను తొలగించాలని ఏఎన్ఎంలు (ANM) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు మండల వైద్యాధికారి బీ. సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీడీ ప్రోగ్రాంలో ఏఎన్ఎంలతో స్క్రీనింగ్ టెస్టులతోపాటు ఆఫ్‌లైన్‌లో రిపోర్టులు తయారు చేయాలని ఉన్నతాధికారులు తమకు ఆదేశాలు జారీ చేశారన్నారన్నారు. ఈ మేరకు తాము ఇప్పటి వరకు పనిచేశామని చెప్పారు. కానీ మళ్లీ ఇప్పుడు ఆఫ్ లైన్ తోటపాటు ఆన్లైన్లో కూడా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి ఆన్లైన్ చేసే పని తమది కాదని, దానిని మరెవరితోనైనా చేయించుకోగలరని అధికారులను కోరారు. ఇప్పటికే చాలా యాప్స్ ఉండటంతో తాము తీవ్ర పని ఒత్తిడికి గురై అనేక మానసిక రుగ్మతలకు గురవుతున్నామని వాపోయారు. బీపీ, షుగర్, స్పాంటేలైటిస్ లాంటి అనేక వ్యాధులతో సతమతమవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యారు. రోజుకు 10 నుంచి12 గంటల పాటు పనిచేయవలసి వస్తుందని, ఒకవైపు ఫీల్డ్ వర్క్‌తో పాటు మరొకవైపు ఆన్లైన్ పనులు చేయలేకపోతున్నామని తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండలానికి చెందిన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.