అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులను నట్టేట ముంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు 1,85,750 మంది ఉండగా.. కేవలం 64,187 మందికి మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నది. నాల్గో విడత విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో సైతం తమ పేర్లు లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అన్నదాతలు మదనపడుతున్నారు. తమ తోటి రైతులకు రుణమాఫీ అయ్యి.. తమకు కాకపోవడంతో అయోమయంలో ఉన్నారు. రుణమాఫీ ముగిసిందని సీఎం ప్రకటన చేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక రూ.2 లక్షలకు పైబడి రుణాలు ఉన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఏడాది వానకాలం, యాసంగి పంటలకు రైతు భరోసా (రైతుబంధు) సైతం ఎగ్గొట్టడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ)
రైతులకు అరకొరగా రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. విడతల వారీగా అంటూ చివరికి మొండి‘చెయ్యి’ చూపించిందంటూ రైతులు మండిపడుతున్నారు. చేసిందేమీ లేకుండానే ఏడాది పాలన సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,85,750 మంది రైతులకు.. 64,117 మందికి మాత్రమే రుణమాఫీ చేయడంతో సర్కారు చేతిలో దగా పడ్డామంటూ గుర్రుగా ఉన్నారు. రైతు ప్రభుత్వమని చెబుతూ రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై సర్వత్రా రైతాంగం మండిపడుతున్నది.
రైతు రుణమాఫీ అనగానే రైతులు పెద్ద ఎత్తున స్పందించి కాంగ్రెస్ నాయకులకు ఓట్లేసి గెలిపించారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కాస్త కొంతమందికే ఇవ్వడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. విడతలుగా రుణమాఫీ చేస్తాం.. ప్రతి రైతుకు రుణమాఫీ వస్తది అని చెప్పిన సర్కారు రేషన్ కార్డులు లేని వారికి ఎగ్గొట్టింది. బ్యాంకు అకౌంట్ నంబర్లు తప్పుపడ్డాయని, పేర్లు సరిగా లేవని మరికొందరు ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రేషన్ కార్డులేని రైతులు 20 వేల మందికి పైగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరి పేర్లతో జాబితాను కూడా తయారు చేసింది. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ పెట్టి రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులను కూడా స్వీకరించారు. కానీ.. వారందరికీ నేటికీ రుణమాఫీ కాలేదు.
ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా రుణమాఫీ రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్న సర్కారు ఆదిలోనే ముఖం తిప్పేసింది. దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్పి మొదటి విడతలో 28,450 మందికి రూ.134 కోట్లు వేసి చేతులు దులుపుకోవడంతో అప్పట్లో రైతులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తర్వాత రెండో విడత అని మరో 16,889 మందికి గాను రూ.143 కోట్లు వేయడంతో మరింతమంది మాకు రాలేదని బ్యాంకులు, సొసైటీల వద్ద నిరసన తెలిపారు. అదీకాక మూడో విడత, నాల్గో విడత అని 11,566 మందికి.. రూ.125 కోట్లు, 7,282 మంది రైతులకు రూ.59 కోట్లు వేసి చేతులు దులుపుకున్నారు. రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ ఇస్తామని ఆశ రేపి చేయలేకపోయారు. కొర్రీలతో నిలిచిపోయిన రూ.2 లక్షల లోపు రుణాలు కూడా మాఫీ చేయలేకపోయారు. దీంతో సన్నకారు రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మరోవైపు ప్రభుత్వం సాయం అందించకుండా చుక్కలు చూపిస్తోంది. దీంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ప్రతిరోజు ఏదో సందర్భంలో పంటలను వదులుకొని రోడ్కెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రైతు భరోసా ఇవ్వాల్సిన సర్కారు రెండు పంటలు కాలం గడిచిపోయినా ఆ ఊసే ఎత్త డం లేదు. పంటలు సర్వే చేయాలని ఏఈవోలపై ఒత్తిడి తేవడంతో వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగులే ప్రభుత్వంపై నిరసన తెలిపారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతమేరకు ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
నాకు మా నాన్న వాళ్లతో రేషన్ కార్డు ఉంది. వేరే ఉంటున్నాను. పంటలు వేశాను. బ్యాంకులో రుణం తీసుకున్నాను. రూ.20 వేలు తీసుకుంటే వడ్డీతో రూ.27 వేలు అయ్యింది. కానీ.. నాకు రుణమాఫీ కాలేదు. నా లాంటి వాళ్లు మా ఊర్లో చాలామంది ఉన్నారు. అందరం కలిసి ఉండడం తప్పా లేక వ్యవసాయం వేరే చేయడం తప్పా అని ఆలోచించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నది.
– కాసిబోయిన సతీశ్, రైతు, చినబండిరేవు, దుమ్ముగూడెం మండలం
నా పేరున బేతంపూడి సొసైటీలో రూ.50 వేల రుణం ఉంది. మొదటి విడత రుణమాఫీ జాబితాలో నా పేరు లేకపోవడంతో అధికారులను అడిగాను. మీ అమ్మ పేరున రూ.1.20 లక్షల రుణం ఉందని చెప్పారు. మూడో విడుతలో పేరు వస్తుందని అధికారులు చెప్పినా.. అందులోనూ పేరు లేదు. మళ్లీ వెళ్లి అడిగితే ఆధార్ నంబర్ తప్పుగా పడింది.. అందుకే కాలేదని చెప్పారు. దానిని సరి చేయించాను. నాల్గో విడుతలోనూ మాఫీ కాలేదు. కాంగ్రెసోళ్లు ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
-తోటకూరి సతీశ్, రైతు, టేకులపల్లి
నా పేరున అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబీలో రూ.1.93 లక్షలు, గుంపెన సొసైటీలో రూ.73 వేల రుణం ఉంది. రెండు బ్యాంకులలో మొత్తం రూ.2. 66 లక్షల రుణం ఉంది. మూడో విడతలో రూ.2 లక్షలలోపు రుణాలు ఉంటే మాఫీ చేస్తామని చెప్పడంతో గుంపెన సొసైటీలోని రూ.73 వేలను నా భార్య బంగారం తాకట్టు పెట్టి అప్పు కట్టాను. అయినా.. రూ.2 లక్షల లోపు రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. అధికారులు రుణమాఫీ చేసి నాకు న్యాయం చేయాలి.
-కోటేశ్వరరావు, రైతు, అన్నపురెడ్డిపల్లి
నాకున్న రూ.1.90 లక్షల రుణం నాలుగు విడతల్లోనూ మాఫీ కాలేదు. ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినా.. అది అమలు కావట్లేదు. మా ఊళ్లోనే 50 మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. నాకు అన్ని అర్హతలున్నా మాఫీ చేయలేదు. రుణం ఇచ్చే ముందు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. కొర్రీలు పెట్టకుండా రుణమాఫీ చేయాల్సిందే.
-చాపలమడుగు రామరాజు, రైతు, అయ్యన్నపాలెం, చండ్రుగొండ మండలం
నేను మధ్యతరగతి రైతును. నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. బ్యాంకులో రూ.2 లక్షల రుణం తీసుకున్నా.. నాలుగు విడతల్లో అధికారులు మాఫీ చేయలేదు. రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. రైతులకు ముందుగా హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదు.
-బుద్ద వెంకటేశ్వర్లు, రైతు, తిమ్మంపేట, ములకలపల్లి మండలం