మాతా, శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చాలామంది పిల్లల బాల్యం ఇంకా బలహీనంగానే ఉంటోంది. ఫలితంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది. తక్కువ బరువు, తీవ్ర పోషకాహార లోపం, వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం వంటి కారణాలతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతి ఏటా అవగాహన కల్పిస్తున్నా..
పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో ఐసీడీఎస్ అధికారుల తీరు తల్లిదండ్రులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 70,677 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 821 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 369 మంది బరువు తక్కువ పిల్లలు, 452 మంది ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు ఉన్నారు.
– అశ్వారావుపేట, డిసెంబర్ 16
తల్లీబిడ్డ ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సంపూర్ణ ఫలితం దక్కడం లేదు. ఏటా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తీవ్ర పోషకాహార లోపం, తక్కువ బరువు, ఎత్తుకు తగ్గ బరువు ఉండడం లేదు. ఈ పిల్లలంతా మధ్య, పేద వర్గాలకు చెందిన వారే. ఫలితంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.
తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో వయస్సు పెరిగేకొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఐదేళ్ళలోపు చిన్నారులను రక్తహీనత వెంటాడుతున్నది. దీనికారణంగా చిన్నారుల్లో ఉత్సాహం, చురుకుదనం కనిపించకపోగా తోటిపిల్లలతో ఆడుకునే పరిస్థితికి దూరమవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి పౌష్టికాహారం అందించి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడటంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
జాతీయ పౌష్టికాహార సంస్థ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్నారుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం బాలామృతం, కోడిగుడ్లు, భోజనం, పాలు సరఫరా చేస్తూనే ఉంది. 7 నెలల నుంచి 3 ఏండ్లలోపు పిల్లలకు నెలలో 16 కోడిగుడ్లు, బాలామృతం రెండున్నర కేజీల ప్యాకెట్‌ను అందిస్తున్నది. తీవ్ర పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు సూపర్వైజరీ ఫీడింగ్ కింద భోజనం పెడుతున్నది. 3-6 ఏళ్ళలోపు పిల్లలకు భోజనం, స్నాక్స్, పాలతోపాటు రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 కోడిగుడ్లు సరఫరా చేస్తున్నది. వీటిని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉడికించి ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఇంటికి పంపించడం వల్ల సక్రమంగా పోషకాహారం అందడం లేదనే వాదనలు ఉన్నాయి.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనేది సర్కార్ లక్ష్యం. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్యలక్ష్మి, హెల్త్చెకప్ వంటి కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల పరిధిలోనే ఉంటాయి. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టిన బిడ్డకు ఐదేళ్లు నిండే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి పౌష్టికాహారం అందిస్తున్నది. అలాగే వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా అంగన్వాడీ కేంద్రాలదే. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడం కారణంగా సత్ఫలితాలు అందడం లేదనే చర్చ వినిపిస్తున్నది. కేవలం వారోత్సవాలు, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే సమయంలో తప్ప అధికారులు మిగతా టైమ్‌లో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పౌష్టికాహారం ప్రయోజనాలు, వాటి సక్రమ వినియోగంపై ప్రభుత్వం ఏటా పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నది. అయినా ప్రయోజనం లేకుండా పోతున్నది. కార్యక్రమాల నిర్వహణలో అధికారులకు చిత్తశుద్ధి ఉండడం లేదని, కేవలం విధి నిర్వహణలో భాగంగా నామమాత్రపు పర్యవేక్షణతో అధికారులు లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ని కార్యక్రమాలు చేసినా అధికారుల్లో చిత్తశుద్ధి లేనప్పుడు ప్రయోజనం ఏముంటుందని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
బాల్య వివాహాలు, అనారోగ్యం, పేదరికం, అవగాహన లేమి కారణంగానే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న వయస్సులోనే గర్భం దాల్చిన మహిళలు నెలలు నిండకుండానే ప్రసవిస్తున్నారు. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం సక్రమంగా తీసుకోకపోవడం, పోషకాహార లోపం వల్ల కలిగే ఇబ్బందులను అర్థమయ్యేలా గర్భిణులు, తల్లులకు అవగాహన కల్పించలేకపోవడం, ఐసీడీఎస్ అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పూర్తి పర్యవేక్షణ లేకపోవడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాలు, గుడ్లు, పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత లేకుండా ఆకుకూరలు, పాలు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపంతో పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
– డాక్టర్ రాధా రుక్మిణి, ప్రభుత్వ వైద్యురాలు, అశ్వారావుపేట
లోపపోషణ ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మామ్ పిల్లలకు బాలామృతం, సామ్ పిల్లలకు బాలామృతం+తీవ్ర పోషకాహార లోపం పిల్లలను భద్రాచలం ఎన్ఆర్సీ (న్యూట్రిషియన్ రిహాబిటేషన్ సెంటర్)కు పంపిస్తున్నాం. ఏటా వారోత్సవాలు నిర్వహించి పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి సూపర్వైజర్ నిత్యం అంగన్వాడీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
– కొయ్యల ముత్తమ్మ, సీడీపీవో, అశ్వారావుపేట