సత్తుపల్లి, జూలై 22: పుస్తక పఠనం.. పేపర్ రీడింగ్ మనలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయి.. సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.. సరికొత్త సంగతులను బోధపరుస్తాయి.. మస్తిష్కానికి పదును పెడతాయి.. విజ్ఞాన వీచికలను తోడ్కొని వస్తాయి.. అయితే ఇప్పుడు చేతిలో మొబైల్ ఉండగా ఇంకా ‘పఠనం ఏంటండీ..?’ అంటారా..? అది నిజమే కావొచ్చు.. కానీ పల్లెసీమల్లో వార్త పత్రికలు చదవడం ఎంతో మందికి ఆసక్తి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.. వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ‘పబ్లిక్ లైబ్రరీలు’ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఖమ్మం జిల్లావ్యాప్తంగా 18 చోట్ల లైబ్రరీలు ప్రారంభమయ్యాయి. ఒక్కో లైబ్రరీ నిర్వహణకు సర్కార్ నెలకు రూ.2 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నది.
గ్రామీణ ప్రజలకు గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకారం చుట్టాయి. ‘పౌర పఠన మందిరాల’ పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు పంచాయతీల్లో వీటిని ప్రారంభించాయి. పల్లె ప్రజల్లో పఠనాశక్తిని పెంచేందుకు, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు వీటి ఏర్పాటును ప్రారంభించాయి. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు చేయించి పౌర పఠన మందిరాలుగా వినియోగిస్తున్నాయి. వీటి ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల నిధులు కేటాయించింది. ఈ నిధులతో అందమైన, ఆకర్షణీయమైన భవనాలుగా రూపుదిద్దుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 18 చోట్ల వీటిని ప్రారంభించింది. వాటిల్లో ముందుగా మండలానికి రెండు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. క్రమంగా అన్ని గ్రామాలకూ విస్తరించనుంది. ఈ పౌర పఠన మందిరాల నిర్వహణకు నెలకు రూ.2 వేలు కేటాయిస్తోంది. వీటిలో రూ.1000 దినపత్రికల కోసం, మరో రూ.1000 గ్రంథాలయ నిర్వాహకుడి పారితోషికం కోసం వెచ్చించనుంది. పౌర పఠన మందిరాలు నిరుద్యోగ యువతకు, పుస్తక ప్రియులకు విజ్ఞానాన్ని అందిస్తాయి. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు కోరిన పుస్తకాలను తెప్పించి అందుబాటులో ఉంచుతారు. పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్నవారు కూడా వచ్చి వివిధ పుస్తకాలు, పత్రికలు చదువుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న వారు అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లడానికి కూడా వీలుంది.
పంచాయతీ ఖాతాకు నెలకు రూ.2 వేలు..
ఒక్కో పఠన మందిరానికి రూ.1.50 లక్షల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండగా వాటిలో రూ.90 వేలను రూము, మరమ్మతులకు, రూ.40 వేలను ఫర్నీచర్‌కు, రూ.10 వేలను పుస్తకాల కొనుగోలుకు, రూ.10 వేలను ఇతర సదుపాయాల కల్పనకు కేటాయించింది. పౌర పఠన మందిరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ అనంతరం వాటి నిర్వహణ, ఇతర సదుపాయాలు వంటి వాటిని గ్రామ పంచాయతీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రెండు దినపత్రికల కొనుగోలు, పౌరపఠన మందిర నిర్వహణ కోసం వెచ్చించే రూ.2 వేలను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ జమచేయనుంది. ఈ పౌర పఠన మందిరాలను అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారు.
18 పౌర పఠన మందిరాల ఏర్పాటు…
ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 18 పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో బోనకల్లు మండలంలోని ముష్టికుంట్ల, లక్ష్మీపురం, చింతకాని మండలంలోని ప్రొద్దుటూరు, కొణిజర్ల మండలంలోని మల్లుపల్లి, కూసుమంచి మండలంలో గోరీలపాడుతండా, పాలేరు, మధిర మండలంలోని సిరిపురం, ముదిగొండ మండలంలోని మేడిపల్లి, పమ్మి, నేలకొండపల్లి మండలంలోని చెరువు మాధారం, పెనుబల్లి మండలంలోని అడవిమల్లేల, సత్తుపల్లి మండలంలోని గంగారం, కాకర్లపల్లి, వేంసూరు మండలంలోని వేంసూరు, చౌడవరం, వైరా మండలంలోని సిరిపురం గ్రామాలు ఉన్నాయి.
కేంద్రాలను వినియోగించుకోవాలి..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, విద్యార్థులు, యువతీ యువకులు, నిరుద్యోగులకు పుస్తక పఠనం అలవాటు చేయడానికి ప్రభుత్వం పబ్లిక్ రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని పఠనాశక్తిని పెంపొందించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న క్రమంలో యువతీ యువకులు, విద్యార్థులు ఈ లైబ్రరీల్లోని పోటీ పరీక్షల పుస్తకాలను వినియోగించుకోవాలి.
-కొత్తూరు ఉమామహేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కోరిన పుస్తకాలు తెప్పిస్తాం..
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాయతీల్లో పౌర పఠన కేంద్రాలను ఏర్పాటు చేశాం. గ్రామస్తులు, యువతీ యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ కేంద్రాలకు వచ్చి అవసరమైన పుస్తకాలు, పత్రికలు చదువుకోవచ్చు. పాఠకులు కోరిన విధంగా పుస్తకాలు తెప్పించి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నాం.
-మందపాటి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్, గంగారం, సత్తుపల్లి మండలం