‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’.. ఇది నిన్నా మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఊరూవాడా వినిపించిన మాట. అందుకు కారణం లేకపోలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని నయాపైసా ఖర్చు లేకుండా పేదోడికి ప్రసాదించి పెట్టింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాత మాట.. కాదుకాదు.. పాత పాట పునరావృతం అవుతున్నది. దీనికి ఖమ్మం జిల్లా సార్వజనీన ఆసుపత్రే ప్రధాన తార్కాణం.
-ఖమ్మం సిటీ, డిసెంబర్ 15
జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలో నిరుపేద రోగులకు కనీస ఆరోగ్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. సరిపడా మందులు అందించరు. రక్త, మూత్ర పరీక్షల పరికరాలు తరుచూ మొరాయిస్తుంటాయి. స్కానింగ్ యంత్రం నెలలో వారం, పదిరోజులు మాత్రమే పనిచేస్తది. గర్భిణులకు అవసరమైన ‘టిఫా’ స్కాన్ టప్పా కట్టేచింది. నిత్యం వేలాదిమందికి అండగా నిలవాల్సిన పెద్దాసుపత్రిలో రోజుకో సమస్య వెక్కిరిస్తున్నా పట్టించుకునే నాథుడెవరో తెలియకుండా పోయింది. మౌలిక వసతులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ప్రభుత్వ పెద్దలు అధికార పల్లకీల్లో ఊరేగుతున్నారు. దీంతో స్థానిక వైద్యాధికారులేమో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వైద్యాధికారుల నివేదిక ప్రకారం రోజుకు 250 నుంచి 300 మంది రోగులు ఎముకలు, కీళ్ల విభాగంలో ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో నమోదు చేసుకుంటున్నరు. వీరందరికీ వైద్య సేవలందించే క్రమంలో ఎక్స్‌లో వ్యాధి నిర్ధారణ ఎంతో కీలకం. కానీ ఈ ఆసుపత్రిలోని ఎక్స్-రే మెషీన్ వారం రోజులుగా పని చేయడం లేదు. నిత్యం వస్తున్న రోగులను వైద్యులు టీ హబ్‌కు పంపిస్తున్నరు. అక్కడున్న యంత్రం రెండు లేదా మూడు ఎక్స్-రేలు తీయగానే మొరాయిస్తున్నది. దీంతో నొప్పులతో బాధపడుతున్న రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. అత్యవసరమైన వారిని బయటకు పంపిస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు.
గర్భిణుల సౌకర్యార్థం గత కేసీఆర్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ‘టిఫా’ స్కాన్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాదిన్నర క్రితం అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. సదరు యంత్రం సాయంతో తల్లి గర్భంలోని పిండం ఐదు నెలల నుంచి ఎదుగుతున్న తీరు తెన్నులను ఇట్టే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ‘టిఫా’ టప్పా కట్టింది. కేవలం దానికి అవసరమైన వైద్యుడిని నియమించని కారణంగా ఎంతో విలువైన ఈ యంత్రం మూలనపడింది. స్కానింగ్ కోసం గర్భిణులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌లో ఒక్కసారి టిఫా స్కానింగ్ చేస్తే రూ.2 వేలు ఖర్చవుతున్నది. ఈ విషయాన్ని పలుమార్లు ముగ్గురు మంత్రులు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దగ్గర ప్రస్తావించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక వైద్యాధికారులు వాపోతుండడం గమనార్హం.
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎక్స్-రే మిషన్‌లో ఎంసీపీ బోర్డు పనిచేయడం లేదు. టెక్నీషియన్‌ను పిలిపించి చూపించాం. ఇంజినీరింగ్ విభాగం వాళ్లు ఆర్డర్ పెట్టారు. సోమవారం నాటికి సమస్య పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి టీ హబ్‌లో ఉన్న ఎక్స్-రే యంత్రాన్ని వినియోగించుకుంటున్నం. ఇబ్బందేమీ లేదు. అదేవిధంగా రేడియాలజిస్ట్ లేని కారణంగా ‘టిఫా’ స్కానింగ్ నిలిచిపోయింది. రేడియాలజిస్ట్ పోస్ట్ కోసం మూడు, నాలుగు దఫాలు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం.
– డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, మెడికల్ సూపరింటెండెంట్