ఇల్లెందు రూరల్, జూన్ 16: ఇండ్లు కోల్పోయిన తమకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు, బాధితులు ఇల్లెందు మండలం పూసపల్లి గ్రామంలో నూతన ఓసీ విస్తరణ పనులను సోమవారం అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఎస్వో టూ జీఎం రామస్వామి, ప్రాజెక్టు అధికారి, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇల్లెందు ఎస్సై హసీనా, ఎస్అండ్పీసీ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు, భారీ స్థాయిలో పోలీసులను మోహరించినా పట్టువిడవకుండా డోజర్కు ఎదురుగా నిలబడి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు, పలువురు బాధితులు మాట్లాడుతూ ఓసీ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, సింగరేణి క్వార్టర్లలో నివసిస్తున్న వారికే క్వార్టర్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్లు సింగరేణి సంస్థ ద్వారానే చేపట్టాలన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని హెచ్చరించారు. దీంతో చేసేది లేక సింగరేణి, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, బాధితులు అబ్దుల్ నబి, పూనెం సురేందర్, మంచాల వెంకటేశ్వర్లు, వెన్నంపల్లి శ్రీనివాస్, హరికృష్ణ, ధనసరి రాజు, తాండ్ర నాగరాజు, సదరం మహేశ్, చాందావత్ రమేశ్, గుళ్ల మొగిలి, గుళ్ల నర్సయ్య, లాలు, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.