కొత్తగూడెం గణేష్టెంపుల్, జనవరి 5 : బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని, దీనిని మానుకొని యథావిథిగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ నిరుపేదల కూలీల పొట్టకొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు.
లోక్సభలో అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అనంతరెడ్డి, అంజయ్య, ఊక్లా, రాంచందర్, కోరం వెంకటేశ్వర్లు, రాంసింగ్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.