ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ది బెస్టు వ్యవసాయ మార్కెట్లలో మద్దులపల్లి ఒకటి. దీని నుంచి ప్రతి సంవత్సరం పుష్కలంగా ఆదాయం మార్కెట్ ఖజానాకు చేరుతున్నది. కానీ ఈ వ్యవసాయ మార్కెట్ ఏ హోదాలో ఉంది అన్నది నేటివరకు తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 లేదా సెలక్షన్ గ్రేడ్ ఇలా కేవలం ఆదాయాన్ని బట్టి హోదా ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం మద్దులపల్లి మార్కెట్ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.3 కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారులు మద్దులపల్లి మార్కెట్‌కు హోదా ప్రకటించకపోవడం తీవ్ర నిర్లక్ష్యపు చర్యగా కనిపిస్తున్నది.
– ఖమ్మంరూరల్, మార్చి 13
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ తీరు. జిల్లాలో ఎనిమిదో మార్కెట్‌గా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఆరేళ్ల క్రితం ఏర్పాటైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి 2018లో విడిపోయింది. ఈ మార్కెట్ పరిధిలో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలంలోని కొన్ని గ్రామాలు కలిపి మొత్తం 44 గ్రామాల సరిహద్దులో నాటి మార్కెటింగ్ శాఖ అధికారులు నోటిఫై చేశారు. మరుసటి ఏడాది 2019 నుంచి ఆదాయ టార్గెట్‌ను సైతం నిర్దేశించారు.
ఒకే ఒక చెక్‌పోస్టు మరో నాలుగు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులపైనే ఆధారపడిన మద్దులపల్లి మార్కెట్ కమిటీ సిబ్బంది నాటినుంచి నేటివరకు తమవంతుగా శ్రమిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన దానికంటే అధికంగానే ఆదాయం సమకూర్చుతున్నారు. దీంతో గత కేసీఆర్ సర్కార్ కొత్త మార్కెట్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రూ.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొద్దినెలల తరువాత మార్కెట్ పునరుద్ధరణ పనులు జరిగాయి. ప్రస్తుతం నిర్మాణం పూర్తిదశకు చేరుకోవడంతో గత నెలలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు క్రయవిక్రయాలను లాంఛనంగా ప్రారంభించారు.
మార్కెట్‌కు హోదా ఇస్తే ఆ హోదాకు అనుగుణంగా అధికారిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తద్వార మార్కెట్‌కు పూర్తిస్థాయి సెక్రటరీ అందుబాటులో ఉంటారు. కానీ ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీనే ఇన్చార్జి సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అతనితోపాటు మరో సూపర్వైజర్, ఇతర ఇద్దరు చిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మార్కెట్ నిర్వహణ లోపభూయిష్టంగా జరుగుతున్నది అనే ఆరోపణలు మార్కెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 11 కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపు 10 లక్షల మిర్చి బస్తాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏ మార్కెట్ పరిధిలో కోల్డ్‌స్టోరేజీలు, జిన్నింగ్ మిల్లులు ఉంటే వాటిద్వారా వచ్చే ఆదాయం ఆ ప్రాంత మార్కెట్లో కలిసే అవకాశం ఉంటుంది. కానీ మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ఉన్న 11 కోల్డ్ స్టోరేజీల నుంచి వచ్చే కోట్లాది ఆదాయం ఆరేళ్ల నుంచి ఖమ్మం ఏఎంసీ పరిధిలోకి వెళ్తున్నది.
దీంతో మద్దులపల్లి మార్కెట్ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కోల్డ్‌స్టోరేజీల వద్ద జరిగే క్రయవిక్రయాల నుంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని మార్కెట్‌కు హోదా కలిపిస్తే జిల్లాలోనే మంచి హోదా కలిగిన మార్కెట్‌గా మద్దులపల్లి మార్కెట్‌కు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంవత్సరం మార్కెట్ ఆదాయం సుమారుగా రూ.3 కోట్లు పైచిలుకు సాధించడంతోపాటు, కోల్డ్‌స్టోరేజీల ఆదాయం సైతం పరిగణనలోకి తీసుకొని హోదా ఇవ్వాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తున్నది.