బోనకల్లు, ఫిబ్రవరి 25: సాగర్ ఆయకట్టు భూములకు మూడు నాలుగు రోజుల్లో నీరందేలా చూస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య అన్నారు. నారాయణపురంలో సాగర్ కెనాల్ కింద వడలిపోతున్న మొక్కజొన్న పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. సాగునీటి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
నారాయణపురం మైనర్ కాల్వ చివరి భూములకు సాగునీరు అందడం లేదని, పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసినైట్లెతే పంటకు నష్టం జరిగే అవకాశం ఉండదని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తూ రెండు రోజులు అదనంగా నీటిని సరఫరా చేస్తే బాగుంటుందని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ పంట ఎక్కడైనా వడలినట్లు కనిపిస్తే 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హులైన రైతులు ఫిజికల్ వెరిఫికేషన్ సకాలంలో పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మధిర డివిజన్ సహాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర, బోనకల్లు నీటిపారుదల శాఖ డీఈఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ ఏఈఈ ఏడుకొండలు, వ్యవసాయ విస్తరణాధికారులు షేక్ హుస్సేన్ సాహెబ్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు.