భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్తగా మంజూరైన నర్సింగ్ కళాశాలలో బుధవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కాలేజీలో 60మందికి అవకాశం ఉండగా మొదటి కౌన్సిలింగ్లో 58మంది ఆప్షన్లు పెట్టుకున్నారు. తొలిరోజు 32మంది ప్రిన్సిపాల్ ద్వారా అడ్మిషన్లు తీసుకున్నారు. వైద్య విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రోత్సాహం కల్పించడంతో మన్యం జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ మంజూరు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే ఐదుగురు విద్యార్థులు కాలేజీలో సీటు దక్కించుకున్నారు. కాలేజీలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించేందుకు మరో భవన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నర్సింగ్ కోర్సు చేయాలని కోరిక ఉంది. ప్రైవేటులో చదవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. సమయానికి ప్రభుత్వం నర్సింగ్ కాలేజీ కొత్తగా మంజూరు చేయడం మా అదృష్టం. రెండవ కౌన్సిలింగ్లో సీటు కోసం వెబ్ఆప్షన్ ఇచ్చాం. సీటు వచ్చింది. ఉచితంగా చదువుకునే అవకాశం దొరికింది. వైద్యవిద్యపై ప్రభుత్వ సహకారం మరువలేనిది.
– భార్గవి, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా.
గతంలో ఎక్కడా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసిన దాఖలాలు లేవు. అందరూ ప్రైవేటులో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేసింది. దీనికి తోడు నర్సింగ్ కాలేజీలు ఇవ్వడం పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరం. ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
– షర్మిల రోస్, ఆత్మకూర్ మండలం,సంగారెడ్డి జిల్లా