ఖమ్మం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కళకళలాడుతుండగా.. ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రైవేట్‌లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చేరే వారి సంఖ్య ఏటికేడు తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో 150 నుంచి 200కు మించి ప్రవేశాలు ఉండట్లేదు. విద్యార్థుల ప్రవేశాలు ఇంత గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం మాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడంలేదు. కళాశాలలు పెరుగుతున్నప్పటికీ అడ్మిషన్లు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చేరే పిల్లల సంఖ్య అత్యధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుంటే.. వీటిల్లో నాలుగింటిలో 50 మందిలోపు, తొమ్మిదింటిలో 100 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. 200 మందికిపైగా విద్యార్థులున్న కళాశాలలు మూడంటే మూడే. అవి కూడా జిల్లా కేంద్రంలోనే. అత్యధికంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 6 ఒకేషనల్ కోర్సులు, 4 జనరల్ కోర్సులు ఉన్నాయి. తర్వాత నయాబజార్ కళాశాలలో ఒకేషనల్‌లో 5 కోర్సులు, జనరల్‌లో 4 కోర్సులు, ఏఎస్ఆర్ కళాశాలలో ఒకేషనల్‌లో 3 కోర్సులు, జనరల్‌లో 4 కోర్సులు ఉన్నాయి.
జిల్లాలో ఈ విద్యాసంవత్సరంలో 21 కళాశాలలు ఉన్నాయి. అన్నింట్లోనూ ఆర్ట్స్, సైన్స్ గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపులో గరిష్టంగా 88 మంది విద్యార్థులను చేర్చుకొనే అవకాశముంది. హెచ్ఈసీ, సీఈసీ, బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో సగటున ప్రతి కళాశాలలో కనిష్టంగా 350 మంది విద్యార్థులకు చదువు చెప్పాలన్నది ఇంటర్ విద్యామండలి లక్ష్యం. కానీ.. జిల్లాలో రెండు మినహా 19 కళాశాలలు ఈ లక్ష్యానికి దూరమే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ప్రతి కళాశాలలో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి 1,000 మంది చొప్పున 21 కళాశాలల్లో సుమారు 20 వేల మంది ప్రవేశం పొందాల్సి ఉంది. కానీ.. ఇందులో 15 శాతం అంటే 3 వేలలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి.
నిరుడు సత్తుపల్లిలో ఒకటి, ఈ ఏడాది కూసుమంచిలో ఒకటి చొప్పున కొత్త కళాశాలలు వచ్చాయి. గతంలో 19 కళాశాలలు ఉండగా.. వీటితో కలుపుకొని ఇప్పుడు 21 అయ్యాయి. వీటిల్లో జనరల్, ఒకేషనల్ కలిపి 2024-25 ప్రథమ సంవత్సరంలో మొత్తం 2,923 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. కళాశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ఇలా ఉంది. ఏఎస్ఆర్ కళాశాలలో-401 మంది, నయాబజార్‌లో-278, బాలికల జూనియర్ కళాశాల-503, సత్తుపల్లి బాలికల కళాశాల-131, సత్తుపల్లి కళాశాల-151, మధిర కళాశాల-130, మధిర సిరిపురం కళాశాల-36, వైరా కళాశాల-92, కల్లూరు కళాశాల-101, ఏన్కూరు కళాశాల-87, పిండిప్రోలు కళాశాల-151, బనిగండ్లపాడు కళాశాల (ఎర్రుపాలెం)-68, నేలకొండపల్లి కళాశాల-150, నాగులవంచ-84, కామేపల్లి కళాశాల-35, కారేపల్లి కళాశాల-148, ముదిగొండ కళాశాల-117, బోనకల్లు కళాశాల-97, పెనుబల్లి కళాశాల-101, కందుకూరు కళాశాల (వేంసూరు)-13, కూసుమంచి కళాశాల-49 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రవేశాలు పొందిన విద్యార్థులు కూడా కళాశాలకు రెగ్యులర్‌గా హాజరు కావడం లేదు. రోజువారీ హాజరు శాతమూ అంతంత మాత్రమే. చాలామంది విద్యార్థులు ఫస్టియర్‌లో అడ్మిషన్ పొంది.. తరువాత మానేస్తున్నారు. కొన్నిచోట్ల అడ్మిషన్లు చూపించేందుకే టెన్త్ పూర్తయిన విద్యార్థులను తీసుకొచ్చి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. తరువాత ఫీజులు చెల్లించకుండా వదిలేస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు ఆయా సబ్జెక్టుల్లో బోధించాలంటే తగినంతమంది విద్యార్థులుండాలి. అప్పుడే వారు రెన్యూవల్ అవుతారు. దీంతో అధ్యాపకులు.. కొందరు విద్యార్థులనైనా చేర్పించే పనిలో ఉంటున్నారు. జిల్లా కేంద్రంలో హాస్టల్లో ఉంటూ వచ్చే విద్యార్థుల హాజరు శాతం కొంత మెరుగ్గా ఉంటున్నప్పటికీ మండల కేంద్రాల్లోని 30 నుంచి 40 శాతం కూడా హాజరు ఉండట్లేదు. అధ్యాపకులు తాము పనిచేసే ప్రాంతాల్లో అడ్మిషన్ల సమయంలో మొక్కుబడిగానే విద్యార్థులను కలుస్తున్నారు.
జూన్ నుంచి అక్టోబర్ వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు పలుమార్లు గడువు పొడిగించాం. ప్రతిసారీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని సూచించాం. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు గ్రామాల్లో తిరిగి అడ్మిషన్లు చేయించే ప్రయత్నం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తాం.