ఖమ్మం, నవంబర్ 12 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి, కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై వారు సమీక్షించారు. మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సన్న, దొడ్డు రకాల కొనుగోళ్లకు ఎన్ని కేంద్రాలు, కేంద్రాలకు సరిపోను స్థల లభ్యత, వసతులు, పరికరాలు ఎన్ని ఉన్నవి, ధాన్యం కొనుగోలుకు వస్తుందా, సమస్యలు ఉన్నాయా అని అదనపు కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 2,88,888 ఎకరాల్లో వరి సాగు చేయగా 6,64,444 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉన్నట్లు వారు తెలిపారు. మొత్తం 324 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 31,008 ఎకరాల్లో వరికోతలు జరగగా, 25,672 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరాయన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం 24గంటల లోపు సంబంధిత మిల్లుకు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.