ఖమ్మం, మార్చి 1 : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నెలాఖరులోగా స్క్రూట్నీ పూర్తి చేసి పెండింగ్ లేకుండా పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎల్ఆర్ఎస్పై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్లు శనివారం వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తుల స్రూట్నీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, సంబంధిత అధికారులు ఉండాలన్నారు.
ప్రతి రోజూ ఎన్ని దరఖాస్తుల స్రూట్నీ జరుగుతుందో లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములు, నీటివనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతించొద్దని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధ్రువీకరణ చేయాలని సూచించారు. భూ క్రమబద్ధీకరణ విషయంలో ఎకడైనా అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎల్ఆర్ఎస్ స్రూట్నీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం అందించే రాయితీ వినియోగించుకునేలా చూడాలన్నారు. అనంతరం మండలాలవారీగా అదనపు కలెక్టర్లు సమీక్షించి.. పెండింగ్ దరఖాస్తుల పరిషారానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించడంతోపాటు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో డీపీవో ఆశాలత, డీఎల్పీవో రాంబాబు, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ షఫీవుల్లా, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.