చింతకాని, ఏప్రిల్ 9: గులాబీ జెండానే ప్రజలకు అండ అని, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో 13 గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రం సంక్షేమ రాజ్యమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ఉమ్మడి పాలనలో వెనుకబాటుకు గురైన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. రైతుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్ జెండానే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. బీజేపీ నాయకులు ఒక్క అబద్ధాన్ని వందల సార్లు ప్రచారం చేస్తున్నారన్నారు. వాటిని ప్రజలు నమ్ముతారన్న భ్రమలో జీవిస్తూ పిచ్చివాళ్లలా తిరుగుతు న్నారన్నారు. గతం, వర్తమానం గురించి బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదన్నారు.
ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్నారు. సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణ అయిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజా కొంటున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. కొద్దినెలల క్రితం పార్టీలో ఉండి, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని, ఇప్పుడు అదే పార్టీని ఓ నాయకుడు విమర్శిస్తున్నారన్నారు. ప్రజలు వాటన్నింటినీ గమనిస్తున్నారన్నారు. ఇకనైనా అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని పదికి పది నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు.
పదవుల కంటే పార్టీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మధిరలో గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలన్నారు. సమ్మేళనంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పెంట్యాల పుల్లయ్య, కోపూరి పూర్ణయ్య, పర్చగాని తిరుపతికిశోర్, గురజాల హనుమంతరావు, మంకెన రమేశ్, కన్నెబోయిన కుటుంబరావు, బొగ్గారపు రాంబాబు, బొడ్డు వెంకట్రామయ్య, కాండ్ర పిచ్చయ్య, గడ్డం శ్రీను, నూతలపాటి వెంకటేశ్వర్లు, నల్లమోతు శేషగిరి, వేముల నర్సయ్య, ఆళ్ల పానకాలు, ఇనుకుళ్ల బ్రహ్మారెడ్డి, బండి రామారావు, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, కొల్లి బాబు, షేక్ మదార్, ఆలస్యం నాగయ్య, తిరుపతి కొండలు, కాళంగి లలిత, సిలివేరు సైదులు, అంగిడి సుధాకర్ పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి..
రాష్ట్రం అవతరణకు ముందు, తరువాత జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. గ్రామస్థాయిలో సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను తెలియజేయాలి. ఆయా పార్టీలు పాలిస్తున్న రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బేరీజు వేసి తేడాలను వివరించాలి. ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండి పార్టీ గెలుపునకు కృషి చేయాలి.
– ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళనాల జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి
తిరుగులేని శక్తి బీఆర్ఎస్..
రాష్ట్రంలో తిరగులేని శక్తి బీఆర్ఎస్. పార్టీ నాయకులు సమష్టిగా పనిచేసి మధిర గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలి. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని చింతకాని మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి రూ.350 కోట్లు అందించారు. గతంలో నిధులు సక్రమంగా విడుదల కాక పంచాయతీలు వెనుబాటులోనే ఉం డేవి. బీఆర్ఎస్ పాలనలో నెలనెలా ఠంచనుగా పంచాయతీలకు నిధులు విడుదలవుతున్నాయి. నిధులతో సర్పంచ్‌లు గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సం క్షేమ పథకాలు అందుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పంట నష్టపోతే ఎమ్మెల్యే భట్టివిక్రమార్క మాత్రం పాదయాత్రలకు వెళ్లారు. ప్రజలకు అండగా నిలువలేని వారిని ప్రజలు అంగీకరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే విధంగా పనిచేద్దాం.
-ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు
మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దాం
వచ్చే ఎన్నికల్లో మధిరలో ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని చింతకాని మండలంలో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. రూ.కోట్ల విలువైన యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుంది. 70 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా సాగునీటి గురించి ఆలోచించలేదు. పక్కనే గోదావరి పోతుంటే సోయి లేకుండా ఉన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే సాగు జలాలు పంట పొలాలకు మళ్లుతున్నాయి.
– రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు