బోనకల్లు, డిసెంబర్ 30: రైతులకు ఎరువుల కొరత లేకుండా అమ్మకాలు నిర్వహించాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్‌చందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముష్టికుంట్ల సహకార సంఘంలో ఎరువుల నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘాలకు సరఫరా అయిన ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని, వారి అవసరాల మేరకు విక్రయించాలన్నారు. ముందస్తుగా తీసుకెళ్లి స్టాక్ పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్న రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, డిసెంబర్ 30: మండలంలోని గట్లగౌరవరం గ్రామంలో మిర్చి పంటను మధిర సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎస్.విజయచంద్ర సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం మిర్చిలో రసం పీల్చు పురుగులు, పొగాకు, లద్దెపురుగులు గమనించడం జరిగిందన్నారు. వాటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3- 0.4 ఎం.ఎల్ లీటర్, ఏపీపెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల రసంపీల్చు పురుగులను నివారించవచ్చన్నారు. రైతులు ఎప్పటికప్పుడు గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు.