బోనకల్లు, ఆగస్టు 20 : ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. బోనకల్లు మండలంలోని బోనకల్లు, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లోని సహకార సంఘాల ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను, సేల్ రిజిస్టర్లను, బిల్ బుక్కులను, పాస్ మిషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించకుండా రైతులకు సరిపడా ఎరువులను అందించాలన్నారు.
రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రైతులు యూరియాను అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని, అలాగే యూరియాను ఒకేసారి కాకుండా దఫ దఫాలుగా వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ పసునూరి వినయ్ కుమార్, ఏఈఓ గోగుల హరికృష్ణ పాల్గొన్నారు.