గుండాల, జూలై 17 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనిని జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ గురించి దిగజారి మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలతో సోమవారం మండలంలోని రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులంతా సుభిక్షంగా ఉన్నారని, దీనిని చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులు సాగుకు ఇబ్బందులకు గురికావొద్దన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, దీంతో రైతులు రెండు, మూడు పంటలు పండించుకొని సుఖంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని అనడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక వ్యవసాయాన్ని వదిలిపెట్టి రైతులు ఇతర పనుల కోసం వలస వెళ్లేవారని, ప్రస్తుతం పూర్తిస్థాయి విద్యుత్‌తోపాటు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు తిరిగి స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జ్ భవానీ శంకర్, బీఆర్ఎస్ నాయకులు వట్టం రాంబాబు, మండల నాయకులు టీ.రాము, అజ్జు, గడ్డం రమేశ్, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.