ఖమ్మం రూరల్, అక్టోబర్ 04 : ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్లూరి పల్లవి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (AIPA -Artificial intelligence programming assistant) విభాగంలో ఆమె ఈ అవార్డును అందుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్లో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధానమంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ.60 వేల కోట్లతో ప్రారంభించారు. దీనిలో భాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రదానం చేశారు. దీనిలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ప్రదాని అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజిత అనందం వ్యక్తం చేశారు.