ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్వి రాజాలకు ఖమ్మంలో ఘన స్వాగతం లభించింది. సరిగ్గా 1:30 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు హెలీప్యాడ్లలో ముఖ్యమంత్రులు, మంత్రులు హెలీకాఫ్టర్లలో దిగారు. వారికి రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, కలెక్టర్ వీపీ గౌతమ్ఘన స్వాగతం పలికారు.
అతిథులకు పుష్పగుచ్ఛాలు అందించి నూతన కలెక్టర్ కార్యాలయానికి తోడ్కొని వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. రెండు హెలీప్యాడ్ల వద్ద పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు బస్సులో చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు పరిచయం చేశారు. హెలీప్యాడ్ దిగగానే ముఖ్యమంత్రులు, అతిథులకు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి హారతులిచ్చి స్వాగతం పలికారు.