కారేపల్లి,డిసెంబర్ 30 : గ్రామపంచాయతీ ప్రజల అవసరార్థం, మరణించిన వారి కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన రగులుతున్న అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్-మేరి దంపతులు తన సొంత నిధులతో మంగళవారం సింగరేణి గ్రామపంచాయతీకి వితరణగా అందజేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు డేవిడ్ పాల్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పలువురు మాట్లాడుతూ దాత డేవిడ్ పాల్ ను అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత మంది ముందుకు వచ్చి పేద ప్రజల అవసరాలు తీర్చడానికి దోహదపడే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
దాత పాస్టర్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం గ్రామపంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇటీవల తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆయన పేరుతో గండుమల్ల నారాయణ జ్ఞాపకార్థం ఫ్రీజర్ బాక్స్ అందించినట్లు తెలిపారు. పల్లె ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేక సుదూర ప్రాంతాలలో ఉన్న వారి బంధువులు కడసారి చూపుకు నోచుకోకుండానే అంత్యక్రియలు జరుగుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని ఉద్దేశంతో తన సొంత గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ ను వితరణగా అందజేస్తున్నామని పేర్కొన్నారు.