ఖమ్మం రూరల్, మే 31 : ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2వ తేదీ నుంచి వంద రోజుల పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు నందు గల పిసివి రెడ్డి ఫంక్షన్ హాల్లో 100 రోజుల స్పెషల్ డ్రైవ్ పై మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ ఉద్యోగులకు, కార్మికులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుంచి 100 రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలో 50 అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో ఈ కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి డివిజన్‌ను సుందరమైన డివిజన్‌గా తయారు చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఒకవైపు పారిశుధ్య కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఆదాయ మార్గాలపై అన్వేషణ కొనసాగుతుందన్నారు. అక్రమ నిర్మాణాల గుర్తింపుతో పాటు ట్రేడ్ లైసెన్స్‌ల జారి వంటి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జూన్ 2న తొలి రోజు మున్సిపల్ కార్యాలయం నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి వంద రోజుల ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఎన్జీఓలను సమన్వయం చేసుకుని జయప్రదం చేయాలన్నారు. వంద రోజులకు ముందు ఏదులాపురం వంద రోజుల తర్వాత ఎదులాపురం తేడా స్పష్టంగా ఉండాలన్నారు. కార్మికులు, ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మెప్మా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Khammam Rural : ఒక మార్పు అభివృద్ధికి మలుపు : కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి