ఖమ్మం అర్బన్, ఆగస్టు 3: ఒక అధికారి బదిలీ అయితే సదరు పోస్టులో ఇన్చార్జినిగానీ, లేదా మరో అధికారినిగానీ నియమిస్తారు. ఒకవేళ ఒక అధికారి ఉద్యోగ విరమణ పొందితే.. విరమణ రోజు సాయంత్రానికి అతడి స్థానంలో మరో అధికారిని నియమిస్తారు. లేదంటే ఇంకో అధికారికి సదరు పోస్టులో ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఖమ్మం జిల్లా విద్యాశాఖ మాత్రం ఇందుకు అతీతంగా ఉంటోంది. ఎందుకంటే ఒక అధికారి ట్రాన్స్ఫర్గానీ, రిటైర్మెంట్గానీ అయినప్పుడు సదరు స్థానంలో జరగాల్సిన నియామక ప్రక్రియకు రోజులు గడుస్తున్నా అతీగతీ లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.
ఖమ్మం డీఈవోగా పనిచేసిన సామినేని సత్యనారాయణ జూలై 31నే ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పటికి నాలుగు రోజులు గడిచినా ఖమ్మం డీఈవోగా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. కీలకమైన ప్రమోషన్ల ప్రక్రియలో కూడా ఎవరికీ బాధ్యతలు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారు. చివరికి జిల్లా విద్యాశాఖాధికారి నియామకం జరగకపోయినా ఉద్యోగోన్నతుల ప్రక్రియ మాత్రం ఆగలేదు.
జిల్లా విద్యాశాఖలోని ఇతర అధికారులు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టర్కు సమాచారం ఇస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. గతంలో ప్రమోషన్ల ప్రక్రియలోనూ, డీఎస్సీ నియామకాల్లోనూ అక్రమాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. వాటిల్లో కొందరు రివర్షన్ కాగా, మరికొందరిని ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే డీఈవో పర్యవేక్షణే ఉండాలి. కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు.
సర్టిఫికెట్ల పరిశీలనకు 8 బృందాలు
ప్రమోషన్ల ప్రక్రియలో భాగంగా ఉద్యోగోన్నతి పొందనున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలనను డీఈవో కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందే ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఉన్నతాధికారులు ఎనిమిది బృందాలను నియమించారు.
గ్రేడ్-2 హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల కేటగిరీకి ఒక బృందాన్ని, స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీకి ఏడు బృందాలను కేటాయించారు. ప్రతీ బృందంలో ఇద్దరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఒకరు డీఈవో కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు జాబితాలో ఉండి గతంలో సర్టిఫికెట్ల పరిశీలన చేసుకొని వారికి మాత్రమే వెరిఫికేషన్ చేయనున్నారు. ఉపాధ్యాయుల టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈడీ స్టడీ సర్టిఫికెట్ల వంటి వాటితోపాటు చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన చేస్తారు.
అభ్యంతరాలు నమోదు..
హెచ్ఎంల సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని కోరగా 25 మంది తమ అభ్యంతరాలను తెలిపారు. డీఈవో కార్యాలయంలో ఆదివారం ఈ అభ్యంతరాలను స్వీకరించారు. వీరిలో అత్యధికమంది వరుస క్రమం, ఒకరిద్దరు పేర్లలోని అక్షరాలు తప్పుగా నమోదైనట్లు పత్రాలను, వాటి ఆధారాలను జత చేసి అందజేశారు. ఈ అభ్యంతరాల్లో పరిగణనలోకి తీసుకునే వాటిని పరిశీలించి తుది జాబితాను సోమవారం ప్రకటించే ప్రక్రియలో కార్యాలయ ఉద్యోగులు నిమగ్నమై ఉన్నారు.
కార్యాలయ సిబ్బందికి ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) చావా శ్రీనివాసరావు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అటు ఉన్నతాధికారులకు, ఇటు కలెక్టర్ కార్యాలయానికి ఈ ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టరే సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు దేవేందర్కుమార్, యూసుఫ్పాషా, ఏపీవో శ్రీనివాసరావు, ఏఎస్వో కిశోర్, కేఎల్ఎన్ పూర్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.