సత్తుపల్లి, సెప్టెంబర్ 11 : విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతోపాటు ఆటల్లో రాణించాలి. ఔత్సాహిక క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించాలి. శారీరక దారుఢ్యం పెంచుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే ఊరికో క్రీడా ప్రాంగణం కోసం సువిశాలమైన స్థలాన్ని కేటాయించి అందులో క్రీడా కోర్టులను ఏర్పాటు చేసింది. జిల్లాలో 589 గ్రామపంచాయతీలు ఉండగా.. 545 క్రీడా ప్రాంగణాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కోచోట ఎకరం నుంచి అరెకరం వరకు స్థలాలను కేటాయించి క్రీడా ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ మొక్కలు నాటడంతోపాటు వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్ త్రో వంటి ఆటలకు సదుపాయాలు కల్పించారు.
ఈ నేపథ్యంలో ఉదయం, సాయంత్రం క్రీడాకారులు సాధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు 606 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను సరఫరా చేసింది. వీటిని ప్రతి మండల కార్యాలయాలకు ఇప్పటికే పంపిణీ చేయగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ కిట్లను క్రీడాకారులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఔత్సాహిక క్రీడాకారులకు ఆటలపై ఆసక్తి కలిగి విధంగా.. వారిలో మరింత క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు స్పోర్ట్స్ కిట్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామానికో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా చుట్టూ మొక్కలు నాటారు. క్రీడాకారులు ఆడుకోవడానికి కోర్టులతోపాటు వాకర్స్ కోసం ట్రాక్‌తోపాటు వారు కూర్చునేందుకు బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు క్రీడా కిట్లు మంజూరయ్యాయి. ఇందులో వాలీబాల్, క్రికెట్ కిట్‌తోపాటు క్రీడాకారుల కోసం టీషర్టులు కూడా ఉన్నాయి. కిట్ల పంపిణీతో గ్రామీణ ప్రాంతాల్లో యువత, విద్యార్థులు ఆటల్లో మరింత రాణించే అవకాశం ఉంది.
క్రీడారంగానికి పెద్దపీట
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వాల హయాంలో క్రీడా సౌకర్యాలు లేకపోవడం.. ఎంతో మంది విద్యార్థులకు ప్రోత్సాహం లేకపోవడంతో మరుగునపడ్డారు. భవిష్యత్‌లో ఇలా జరగొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతితోపాటు వారికి శాలువాలు కప్పి అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రాంగణాల్లో యువత, విద్యార్థులు క్రీడాకిట్లను సద్వినియోగం చేసుకొని మరింతగా రాణించాల్సి ఉంటుంది.
ఒక్కో కిట్‌లో 11 రకాల వస్తువులు…
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, యువత కోసం అందిస్తున్న కేసీఆర్ స్పోర్ట్స్ కిట్‌లో 11 రకాల ఆట వస్తువుల పరికరాలు ఉన్నాయి. క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, టీషర్టులు, మెజరింగ్ టేబుల్, విజిల్స్, స్టాఫ్ వాచ్, డంబుల్స్, డిస్కస్ త్రో, టెన్నికాయిట్ రింగ్స్, రోప్‌లు వంటి క్రీడా సామగ్రిని కిట్‌లో పొందుపరిచారు. కిట్‌లో రెండు జతల బ్యాటింగ్ గ్లౌజులు, వికెట్ కీపింగ్ గ్లౌజులు, ఆరు బంతులు, లెగ్ గార్డులు, నాలుగు సింథటిక్ వాలీబాల్స్, రెండు వాలీబాల్ నెట్లు, సైకిల్ పంపు, మూడు సెట్ల డంబుల్స్, స్కిప్పింగ్ తాళ్లు, మూడు ప్లాస్టిక్ విజిల్స్, క్రికెట్ బ్యాట్లు, టీషర్టులు ఉన్నాయి.
కిట్లు ఇవ్వడం సంతోషకరం
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరం. ఇప్పటికే ఊరూరా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించారు. ఇప్పుడు స్పోర్ట్స్ కిట్లు అందించడం శుభపరిణామం. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
తడికమళ్ల అశోక్, క్రీడాకారుడు, ఎన్టీఆర్నగర్
తెలంగాణలో మంచి గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మించడంతో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభించింది. ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్లు అందించి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
– గుదే చాణక్య, క్రీడాకారుడు, సత్తుపల్లి
ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మండలంలోని ప్రతి పంచాయతీకి స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తాం. గ్రామాల్లో ఇప్పటికే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అన్ని హంగులతో పూర్తయ్యాయి. అందులో కోర్టులు సైతం సిద్ధం చేసి ఉంచారు. కిట్లను పంపిణీ చేయగానే యువత, విద్యార్థులు ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవడంతోపాటు కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి. ఆటలతో మానసిక ప్రశాంతతతోపాటు దేహ దారుఢ్యం పెరుగుతుంది.
– జయరాం, ఎంపీడీవో, సత్తుపల్లి
శిక్షణకు ఎంతో ఉపయోగం
మా గ్రామాల్లో ఇప్పటికే నిత్యం వాలీబాల్, క్రికెట్ ఆడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రామాల్లో క్రీడా కిట్లు పంపిణీ చేయడంతో క్రీడాకారుల శిక్షణకు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటి ద్వారా పూర్తిస్థాయి శిక్షణ పొంది క్రీడా పోటీల్లో విజయం సాధించేందుకు దోహదపడతాయి. క్రీడా కిట్లు అందించే ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సారా నాగప్రసాద్, క్రీడాకారుడు, రుద్రాక్షపల్లి