ఖమ్మం, జూన్ 8: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాలోనూ ఆ మేరకు ఇండ్లు మంజూరు చేసింది. తొలుత మండలానికి ఒకటి చొప్పున పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో మాత్రమే కొంత మేరకు నిజమైన పేదలకు మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. మొదట గ్రామసభల్లో మంజూరు పత్రాలు అందించి.. తీరా ఇల్లు కూల్చుకొని ముగ్గుపోసుకున్నాక జాబితాలో పేరులేదంటూ ఎగనామం పెట్టిన ఘటనలూ ఖమ్మం రూరల్ వంటి మండలాల్లో వెలుగు చూసిన విషయం విదితమే.
ఇక, తొలుత మొదలైన పైలట్ గ్రామాల్లో కొంత వరకూ నిరుపేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేసినప్పటికీ.. తరువాత అన్ని గ్రామాల్లో ప్రారంభించిన అర్హుల ఎంపికలో మాత్రం పూర్తిగా రాజకీయ శక్తులు ప్రవేశించాయి. ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపిక బాధ్యతను సాక్షాత్తూ ప్రభుత్వమే అప్పగించడం, ఆ కమిటీ నిండా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే ఉండడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారినే ఆ కమిటీ ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం, ఎంపికల్లో ఇందిరమ్మ కమిటీలదే అంతిమ నిర్ణయం కావడం, దీనిపై అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధులను పేదలు నిలదీయడం, కొన్ని గ్రామాల్లో అధికారుల సర్వేనూ అడ్డుకోవడం వంటి ఘటనలు జిల్లాలో చోటుచేసుకోవడం గమనార్హం. అయినప్పటికీ అమాత్యులు మాత్రం అన్ని సభల్లోనూ ‘రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం’ అనే మాటలు పలుకుతుండడంతో నిరుపేదల విస్మయం వ్యక్తం చేస్తుండడం విశేషం.
నెరవేరుస్తామంటూనే సొంతింటి కలకు తూట్లు..
నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నప్పటికీ.. షరతులు, నిబంధనల పేరిట అసలైన పేదల సొంతింటి కలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నట్లుగానే ఉంది. ప్రభుత్వం ఇస్తామంటున్న రూ.5 లక్షలతో ఉండడానికి గూడు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు అడియాశలవుతున్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీల ప్రమేయం గణనీయంగా ఉండడం, అధికార పార్టీకి చెందిన వారికే ఇండ్ల మంజూరులో అగ్రతాంబూలం వేయడం, కొన్ని వెసులుబాట్లు కూడా లేకుండా కఠిన నిబంధనలు విధించడం వంటివి ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేదలను దూరం చేస్తున్నాయి.
అయితే, తొలుత ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరు తమ అవసరాలకు అనువుగా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అలా చేస్తే బిల్లులు రావంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో వారంతా ఇప్పుడు ఆ నిర్మాణాలను పునరుద్ధరించుకుంటున్నారు. అయితే, మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నిలిపివేసినట్లు తెలిసింది.
మెడ మీద కత్తిలా నిబంధనలు..
ఇక అక్కడో ఇక్కడో ఎంపికైన నిరుపేదలు కూడా తమ సౌకర్యాలను అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే వెలుసుబాటు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కఠినమైన నిబంధనలు తెచ్చింది. దీంతో ఇంటి నిర్మాణంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా, తమకు అనువుగా ఏ కాస్త నిర్మాణాన్ని మార్చినా అర్హుత కోల్పోవడంతోపాటు నిర్మించుకున్న ఇంటికి బిల్లును కూడా నిలిపివేసే నిబంధనలను లబ్ధిదారుల మెడపై కత్తిలా వేలాడదీస్తోంది.
తాము చెప్పిన చోట కాకుండా బాత్రూమ్ను మరోచోట నిర్మించినా, గదుల వైశాల్యాలను ఏ మాత్రం పెంచినా తగ్గించినా, స్లాబ్ విస్తీర్ణంలో మార్పులు జరిగినా అనర్హత వేటు వేయనున్నట్లు ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చిన యాప్లో.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసినప్పటి నుంచి మొదలుకొని నిర్మాణం పూర్తయ్యే వరకూ ఎప్పటి దశను అప్పుడే ఫొటో తీసి అప్లోడ్ చేసేలా రూల్స్ రూపొందించారు. ఆ నిబంధనల ప్రకారం ఆయా దశల్లో ఇంటి నిర్మాణం జరిగేతే బిల్లులు మంజూరవుతాయని, లేదంటే మంజూరు కావని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇలా.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయాలకు తావుండదని, అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఇలా అధికారిక సభలు, సమావేశాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అమాత్యులు ప్రసంగాలు వినిపించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. తొలుత కొన్ని పైలట్ గ్రామాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి రాజకీయాలకు అతీతంగా నిరుపేదలను ఎంపిక చేసినప్పటికీ.. మిగిలిన పైలట్ గ్రామాల్లోనూ అనేకమంది నిరుపేదల ఆందోళనలు చేసిన ఘటనలున్నాయి. తరువాత అన్ని గ్రామాల్లోనూ మొదలైన అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీలే కీలకంగా ఉండి లబ్ధిదారుల ఎంపిక చేయడం గమనార్హం.
రాష్ట్రంలో నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టింది. ఖమ్మం జిల్లాలో 9,326 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణ పురోగతిని అనుసరించి నాలుగు దశల్లో గ్రీన్ చానల్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా రూ.5 లక్షలను జమ చేస్తుంది.
-ఖమ్మంలో ఇటీవలి రాష్ట్ర అవతరణ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకు ఉపయోగపడాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 20 లక్షల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఎక్కడా లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం
-ఇటీవల ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అర్హత కలిగిన ప్రతి నిరుపేదకూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలి. ఎక్కడా రాజకీయపరమైన వివక్ష ఉండొద్దు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేయాలి. ఎలాంటి తేడాలూ రావద్దు.
-ఇటీవలి అధికారుల సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు