
బహుళ ప్రాచుర్యానికి మిషన్ భగీరథ మంచినీరు
వాణిజ్యపరమైన గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌గా అందుబాటులోకి..
అధికారిక సమావేశాల్లో వినియోగించేందుకు నిర్ణయం
ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారుల ఎదురుచూపు
ఖమ్మం, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మిషన్ భగీరథ నీళ్లు ఇక బాటిళ్లలో ప్రత్యక్షం కానున్నాయి. ప్రైవేట్ కంపెనీలు అందిస్తున్న మాదిరిగా బాటిళ్ల రూపంలో అందించేందుకు మిషన్ భగీరథ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతటా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రతి వీధికి, ప్రతి ఇంటికి అందిస్తున్న మిషన్ భగీరథ నీటికి వాణిజ్య పరమైన గుర్తింపు తేవాలన్న సంకల్పంతో ప్రభుత్వం బాటిళ్ల ద్వారా ఈ నీటిని సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తోంది. మిషన్ భగీరథ మంచినీళ్లు అన్ని గ్రామాలకు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం గత జనవరి నెలలోనే ఈ నీళ్లను బాటిళ్లలోకి మార్చి ఆకర్షణీయమైన లేబుల్ వేయడం ద్వారా ప్రైవేట్ సంస్థలు సరఫరా చేసే మంచినీళ్ల బాటిళ్లకు దీటుగా వీటిని రూపొందించాలని సంకల్పించింది. మిషన్ భగీరథ మంచినీళ్లను బాటిళ్లలోకి మార్చి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, జిల్లా స్థాయి అధికారిక సమావేశాల్లో వినియోగించాలని, ఇందుకు అయ్యేఖర్చును ఆయా సమావేశాలను నిర్వహించే శాఖల నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి నెలలో ఖమ్మం జిల్లాలో ఈ ప్రతిపాదన తెరపైకి రాగానే అధికారులు 2,500 బాటిళ్లను తీసుకొచ్చి అత్యంత ఆకర్షణీయమై లేబుళ్లను వేసి కొన్ని సమావేశాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో వినియోగించారు. అయితే ఈ మంచినీళ్ల ప్యాకింగ్ యూనిట్ స్థానికంగా లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి బాటిళ్ల నీళ్లు తీసుకురావడంతో అయ్యే వ్యయం వంటి అంశాలను మిషన్ భగీరథ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ మంచినీరును బాటిళ్లలోకి మార్చేందుకు అనువైన వసతులపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అత్యం త నాణ్యతా ప్రమాణాలు కలిగిన మిషన్ భగీరథ మంచినీటిని అధికారిక సమావేశాల్లోనే కాకుండా ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడంతో ఈ మంచినీటికి అత్యధిక డిమాండ్ కల్పించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఆదేశాలే తరువాయి..
మిషన్ భగీరథ మంచినీటిని బాటిళ్ల ద్వారా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలేమీ రాలేదు. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన మిషన్ భగీరథ మంచినీళ్లు బాటిళ్లలోకి తేవడం ద్వారా అనేక మందికి నాణ్యమైన మంచినీరు అందించేందుకు అవకాశం ఉంది. మిషన్ భగీరథ మంచినీళ్లను బాటిళ్లలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
-శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, మిషన్ భగీరథ